స్థానికసంస్థల ఎన్నికల నిర్వాహణకు కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం

Update: 2020-03-05 18:11 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కసరత్తు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందుంచింది అధికారుల బృందం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌తో పురపాలక, పంచాయతీరాజ్, పోలీస్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

ఈనెల 21న MPTC, ZPTC ఎన్నికలు, 24న పురపాలక సంఘాలు, 27న గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై ఎన్నికల కమిషనర్‌తో చర్చించారు అధికారులు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తిచేయాలంటే ఇదే ప్రత్యామ్నాయ మార్గమని ప్రస్తావించారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులోగా రావాలంటే.. ఈ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తరపున లేఖ రాయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అటు వీలైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వివరాలు అందజేస్తామని ఉన్నతాధికారుల బృందం కమిషనర్‌కు తెలిపింది.

Similar News