కర్నాటకలోని తుమకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అదే సమయంలో వేగంగా వస్తున్న మరో కారు బోల్తాపడిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కునిగల్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో 10మంది తమిళనాడుకు చెందినవారు కాగా, మరో ముగ్గురు బెంగళూరుకు చెందినవారు ఉన్నారు. కర్నాటకలోని ధర్మస్థలంలో ఉన్న ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చనిపోయిన వారిలో అయిదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనతో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ లిచిపోయింది. ప్రమాదంతో ఘటనాస్థలి అంతా భీతావహంగా మారింది.