జనతా కర్ఫ్యూకి సిద్ధమవుతున్న తెలంగాణ

Update: 2020-03-21 15:44 GMT

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అనుమానితల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఆలయాలను మూసివేశారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, మరొక వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలటంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20కి చేరింది.

ఆదివారం నాటి జనతా కర్ఫ్యూకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు. అటు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతపై మరికాసేపట్లో నిర్ణయం వెలువడే అవకాశంవుంది. అటు 102 రైళ్లకు గాను.. ఆదివారం కేవలం 12 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుపుతామని రైల్వేశాఖ ప్రకటించింది.

ఇక, జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం పెట్రోల్ బంకులు పాక్షికంగా నిర్వహిస్తామని పెట్రోల్ బంకులు యాజమాన్యం ప్రకటించింది. ఒక్కో బంకులో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉంటారని.. ఒక పెట్రోల్, ఒక డీజీల్ పంపు మాత్రమే పనిచేస్తాయిని స్పష్టం చేసింది. అదికూడా ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తామని ప్రకటించింది. సాదారణ, ప్రయివేటు వాహనాలకు ఇంధన విక్రయం ఉండదని తేల్చచెప్పారు.

అటు నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మొత్తం శుభ్రం చేయిస్తోంది. దీనితో పాటు నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని పలు రకాల కంపెనీలు కూడా మూసివేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఫర్నిచర్ జెయింట్ ఐకియా కూడా హైదరాబాదులోని తమ స్టోర్ ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇంకా పలు ప్రముఖ కంపెనీలు అడిడాస్, యాపిల్, నైకీ కూడా తమ స్టోర్ లను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి.

కరోనా వైరస్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా దెబ్బకు ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఎయిర్ పోర్ట్ లో అంతర్జాతీయ టర్మినల్ ను మూసివేస్తున్నారు. దీంతో ..హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. మరోవైపు.. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇక, ఇండోనేషియా బృందం నిర్వాకంతో కరీంనగర్ పట్టణం వణికిపోతోంది. అక్కడ మూడో రోజు కూడా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటీ స్క్రీనింగ్ టెస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 76 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించిన 34 మందికి హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. అటు 60 డివిజన్లలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.