ఆర్బీఐ వరమిచ్చినా చిన్న కంపెనీలను బ్యాంకులు పట్టించుకోవడం లేదా?

Update: 2020-04-30 21:43 GMT

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడంతో, ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి.. ఆర్బీఐ చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా బ్యాంకులకు చవకగా నిధులు అందేలా చర్యలు తీసుకోగా.. ఈ ప్రభావంతో తగినంత లిక్విడిటీ ఉంటుందని ఆర్బీఐ భావించింది. ఏ సమయంలోనైనా మరిన్ని చర్యలకు సిద్ధం అని ఆర్బీఐ చెబుతున్నా.. గ్రౌండ్‌లెవెల్‌లో వాస్తవం అందుకు సమీప స్థాయిలో కూడా లేదు. ఆర్బీఐ ఇచ్చిన భరోసా వాస్తవరూపం దాల్చలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

లాంగ్ టెర్మ్ రెపో ఆపరేషన్ 2.0 అంటూ.. ఆర్బీఐ రెండో దఫా ఇచ్చిన ప్రోత్సాహకాలతో భాగంగా.. బ్యాంకులు తమ నిధులలో సగాన్ని NBFCలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఇవ్వాలని చెప్పింది. అయితే.. ఇక్కడే బ్యాంకులు ఒక చిట్కా పాటించాయి. ఇందులో భాగంగా 25 వేల కోట్ల రూపాయల నిధులను ఆక్షన్‌కు ఉంచితే.. కేవలం 12850 కోట్లకు మాత్రమే బిడ్స్ దాఖలు అయ్యాయి. అంటే.. చిన్న సంస్థలకు ఇచ్చేందుకు ఆర్బీఐ ఆఫర్ చేసిన రుణంలో.. బ్యాంకులు సగం మాత్రమే నిధులను స్వీకరించాయి. ఇందుకు కారణం భవిష్యత్తులో బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయనే భయం అని నిపుణులు చెబుతున్నారు.

ఈ స్కీమ్‌లో భాగంగా ఆర్బీఐ వద్ద 4.4 శాతం వడ్డీ బ్యాంకులు రుణం తెచ్చుకుని.. 2-2.5 శాతం మార్జిన్‌తో చిన్న వ్యాపారాలకు రుణం ఇవ్వవచ్చు. అయితే.. ఈ స్కీమ్‌లో భాగంగా ఇచ్చే రుణాలలో ఎంతో రిస్క్ ఉంటుందని.. తక్కువ పేపర్ వర్క్, తక్కువ వడ్డీ వంటివి ఆకర్షణీయంగా ఉన్నా.. ఫ్యూచర్‌లో NPAల సమస్య ఎదురవతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవైపు కొవిడ్-19 వ్యాప్తి.. మరోవైపు లాక్‌డౌన్.. ఈ రెండింటి కారణంగా MSMEలకు రుణ చెల్లింపు సామర్ధ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. 4.4 శాతానికి నిధులు అందుకుని.. వీటిని 6.5 నుంచి 10 శాతం వడ్డీ రేటు చొప్పున ఇవ్వడం బ్యాంకులకు లాభదాయకమే అయినా.. మారటోరియం పూర్తయ్యాక.. కంపెనీలకు చెల్లింపు సామర్ధ్యం కూడగట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే బ్యాంకులు ఆ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు.

చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాలపై రిస్క్‌ను ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ స్వీకరిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఎకానమీని గాడిలో పెట్టడం కోసం 3 లక్షల కోట్ల రూపాయల బ్యాంక్ లోన్స్ అందించే ప్రతిపాదనను ప్రస్తుతం కేంద్రం సిద్ధం చేస్తోందని.. అయితే.. ఈ రిస్క్‌ను కేంద్రమే భరించేందుకు సిద్ధమైతే మాత్రమే.. కంపెనీలకు ఈ రుణాలను బ్యాంకులు అందించే అవకాశముందని అంటున్నారు.

Similar News