మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల కమిషన్ పెద్ద ఉపశమనం కలిగించింది, మే 27 కి ముందు మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయినట్టయింది. ఐదునెలల కిందట మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్‌ఠాక్రే ప్రస్తుతం ఏ సభలోను సభ్యుడిగా లేరు.. 2020 మే 27 లోపు ఎన్నిక కావాలి.
దీంతో ఎమ్మెల్సీ కోటా కింద ఎన్నిక కావాలని నిర్ణయించుకున్నారు. కానీ కరోనా సంక్షోభం కారణంగా తొమ్మిది స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం గతంలో నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌ను అమలులో ఉన్న దృష్ట్యా కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.