ఏపీలో షాకిస్తున్న కరెంట్ బిల్లులు

Update: 2020-05-08 23:29 GMT

ఏపీలో కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో రీడింగ్ తీయకుండా ఇప్పుడు ఒకేసారి స్పాట్ బిల్లింగ్‌ ఇస్తుండడంతో దాన్ని చూసి వినియోగదారుల గుండె గుభేల్‌మంటోంది. రెండు నెలల బిల్లు ఒకేసారి రావడంతో యూనిట్లు పెరిగిపోయి కేటగిరీ మారిపోతోంది. దీనివల్ల వెయ్యి రూపాయలు కట్టాల్సినచోట 2 వేలు కట్టాల్సి వస్తోంది. మార్చి నెలలో కొందరు సరాసరి లెక్కన కొంత మొత్తాన్ని కట్టినా అలాంటి వారికి కూడా ఇప్పుడు బాదుడు తప్పడం లేదు. సాధారణంగా 50 యూనిట్ల లోపు ఒక స్లాబ్‌, 100 యూనిట్ల లోపు ఒక స్లాబ్, 100 యూనిట్లు దాటితే ఇంకో స్లాబ్‌ లెక్కన ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు డొమెస్టిక్ వాడకంలో 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల లోపు యూనిట్‌కి మూడు రూపాయల 60పైసలు ఉందనుకుంటే, అదే 200 యూనిట్లు దాటితే 6 రూపాయల 90 పైసలు అవుతుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడం, పైగా లాక్‌డౌన్ వల్ల అంతా ఇళ్లలోనే ఉండడంతో వినియోగం భారీగా పెరిగింది. ఇది చాలదన్నట్టు రెండు నెలలకు కలిపి బిల్లు ఇవ్వడంతో కట్టాల్సిన మొత్తం రెట్టింపైంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ పంపిణీ సంస్థల బాదుడు నుంచి తమను కాపాడాలని సామాన్యులు కోరుకుంటున్నారు.