ఆర్థిక ప్యాకేజీ ద్వారా వలస కార్మికుల కోసం తీసుకున్న చర్యలు

Update: 2020-05-14 20:16 GMT

వలస కార్మికులకు వచ్చే రెండు నెలల రేషన్ ఉచితంగా అందిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రేషన్ కార్డులు లేనివారికి కూడా ఆహార దాన్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనివలన 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధిపొందనున్నారని ఆమె వెల్లడించారు. దీని వలన 3500 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. అయితే.. వలస కార్మికులను గుర్తించి వారికి ఆహార ధాన్యాలు పంపీణీ చేసే బాధ్యత రాష్ట్రప్రభుత్వాలకే అప్పగించారు.

వలస కార్మికులు, పట్టణ పేదలకు.. భోజనం, వసతి కల్పించేందుకు రాష్ట్రాలకు కేంద్రం అందించే విపత్తు నిర్వాహణ నిధులను వినియోగించుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. రెండు నెలల్లో 11 వేల కోట్లు కేంద్రం నిధులను ఖర్చుపెట్టుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వసతి లేని వారికి మూడు పూటల బోజన వసతి కల్పించేందుకు కేంద్రమే రాష్ట్రాలకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టించిందని గుర్తుచేశారు.

సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్న వలస కార్మికులకు.. అక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 40 నుంచి 50 శాతం అదనంగా పని కల్పిస్తామని.. దీంతో సొంత రాష్ట్రాలకు చేరుకున్న వలస కార్మికులకు పని దొరుకుతుందని అన్నారు. హార్టికల్చర్‌, పశుపోషణ, మొక్కల పెంపకం లాంటి పనులతో వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు.

అటు, కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే.. మళ్లీ పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికులను రప్పించుకునేందుకు సంస్థలకు అవకాశం కల్పించామని.. అటు, సంస్థలతో నేరుగా ఒప్పందం చేసుకున్న కార్మికుల హక్కుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించామని నిర్మల వెల్లడించారు.

Similar News