కరోనా కట్టడి.. లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 1 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 200 నాన్ ఏసీ రైళ్లు అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. జూన్ 1 నుంచి రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అవి ఏయే మార్గాల్లో నడుస్తాయో.. షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. వాటి కూడా రైల్వే స్టేషన్‌లో టికెట్ల బుకింగ్ ఉండదు. ఆన్‌లైన్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలు 200 నాన్ ఏసీ రైళ్లు తీరుస్తాయని రైల్వే శాఖ చెప్తోంది.
మరోవైపు.. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లు చేరుకునే తుది గమ్యం ఏ రాష్ట్రంలో ఉంటే.. అక్కడి ప్రభుత్వ అనుమతి ఉండాలన్న నిబంధనను ఎత్తివేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు వలస కార్మికులు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో రాజకీయంగా రాద్ధాంతం నెలకొంది. దీంతో.. కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. హోంశాఖను సంప్రదించి రైల్వేశాఖే అనుమతులు జారీ చేయనుంది. వలస కూలీలు కాలినడకన వెళ్లకుండా జిల్లా యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.