ఆపదలో ఆదుకోడానికి ఆహ్వానం అవసరం లేదు..

Update: 2020-05-27 17:02 GMT

ఆపదలో ఆదుకోడానికి ఆహ్వానం అవసరం లేదు. చెయ్యాలనే ఆలోచన, మానవత్వం ఉంటే చాలు. సేవ చెయ్యాలన్న ఆలోచనకు కులమతాలు అడ్డుకాదు.. ఈ కరోనా సమయంలో ఆలయాలు, రోడ్లు శుభ్రం చేసి అందరికి ఆదర్శంగా నిలిచిందో ముస్లిం మహిళ. ప్రతిరోజూ ఏదో ఒక రోడ్డు లేదా ఆలయాన్ని పరిశుభ్రపరచడం చేస్తోందామె. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ముందుకెళ్లాల్సిందే. ఉజ్మా సయీద్ పర్వీన్.. లక్నో విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్.. చిన్నప్పటినుంచి సేవచేయాలన్న దృక్పధాన్ని అలవాటు చేసుకుంది. అందుకే సామాజిక కార్యకర్తగా మారారు. బాధ్యతాయుతమైన పౌరురాలిగా, కోవిడ్ -19 సంక్షోభ సమయాల్లో తన వంతు సహకారం అందిస్తోంది. రోడ్లు, ఇతర ప్రాంతాల తోపాటు దేవాలయాలను కూడా శానిటైజ్ చేస్తోంది. ఓల్డ్ లక్నోలో శానిటైజింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన పర్వీన్, సిబ్బంది అరుదుగా చేరుకునే ప్రాంతాలను కవర్ చేస్తున్నారు.

కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటం అవసరమని తెలుసుకున్న పర్వీన్ ఏప్రిల్ చివరి వారంలో ఈ పని మొదలుపెట్టారు. బుర్కా ధరించి ప్రతిరోజూ ఏదో ఒక ఆలయం లేదా అపరిశుభ్రంగా ఉండే రోడ్లను ఎంచుకుంటారు.. ఇందులో కలిసివచ్చే వారితో కూడా శానిటైజ్ చేయిస్తారు. అయితే దేవాలయాలు, రోడ్లు మరియు ఇతర సంస్థలను శుభ్రం చేస్తున్నప్పుడు ప్రజలు తనను వింతగా చూస్తుంటారని.. కానీ అవేవి పట్టించుకోకుండా చేసే పని మీద దృష్టిసారిస్తానని చెప్పారు. ఈ కష్ట సమయాల్లో దేశానికి, మనకు అవసరం ఉంది.. ఈ సమయంలో ఎవరైనా ఇదే ఆశిస్తారు.. కోవిడ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఎప్పుడూ గ్రహించలేదు.. ప్రారంభంలోఅందరిలాగే దీన్ని సాధారణంగా తీసుకున్నాను. అయితే కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుండటం చాలా పెద్ద విషయం అని గ్రహించాను. ఈ క్రమంలోసంక్రమణతో పోరాడటానికి ప్రతి వ్యక్తి సహకారం అవసరం.. అందువల్ల, ఎటువంటి పరిశుభ్రతకు నోచుకోని వీధులను శుభ్రపరచాలని నిశ్చయించుకున్నానని వెల్లడించారు.

అయితే ఈ విషయంలో తన భర్త , అత్తమామలను ఒప్పించడం అంత సులభంగా జరగలేదు. రంజాన్ సమయంలో ఇది కఠినమైన పని అని సూచించారు. అయితే పనిపట్ల నా అంకితభావం చూసి చివరకు అంగీకరించారు. నా ఇద్దరు పిల్లలను నిద్రపోతున్నప్పుడు రోజూ ఉదయం 7 గంటలకు ఇంటి నుండి బయలుదేరి శానిటైజ్ పనులకు వెళతాను. మొదట్లో దాదాపు 20 వీధులు, సందులను శుభ్రపరచడం కొనసాగించాను.. వీటిలో సాదత్‌గంజ్, కాంప్‌బెల్ రోడ్, హుస్సేనాబాద్, అమీనాబాద్ ప్రాంతంలోని సందులు , వారికి ఉప దారులు, అలాగే ఫైజుల్లాహ్గంజ్ లో మతపరమైన సంస్థలు కూడా ఉన్నాయని అన్నారు. నేను చేసే ఈ పని మరికొంతమంది చూసి ఇన్స్పైర్ అవ్వాలన్న కారణంతో ఫేస్‌బుక్‌లో శానిటైజ్ పనులను ప్రత్యక్ష ప్రసారం చేస్తాను అన్నారు. ఇక కేవలం శానిటైజ్ పనులే కాక లాక్డౌన్లో చిక్కుకొని ఒంటరిగా ఉన్న కార్మికులకు కూడా ఆమె సహాయపడ్డారు. వారికి ఆహార ధాన్యాలు , మనుగడ వస్తు సామగ్రిని కూడా పంపిణీ చేశారు. అంతేకాదు ఈ పనులకు సొంత ఖర్చులతో 60 లీటర్ల క్రిమిసంహారక మందులను ఉపయోగించినట్టు చెప్పారు. ఇందుకోసం పొదుపు చేసుకున్న సుమారు రూ .95,000 ఖర్చు చేశానని అన్నారు.. ఈ డబ్బు ఉపయోగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదని గ్రహించాను అని పర్వీన్ అన్నారు.

Similar News