దోపిడీ దొంగల దాడిలో మహిళ మృతి.. ఆమె భర్తకు తీవ్ర గాయాలు!

Update: 2020-06-02 16:00 GMT

కేరళలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దోపిడీ దొంగల దాడిలో 55 ఏళ్ళ మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొట్టాయం సమీపంలోని తాజతంగడి వద్ద వారి నివాసంలో జరిగిందని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం ఇరుగుపొరుగు వారు బాధితుల ఇంటి నుంచి ఎల్‌పిజి గ్యాస్ లీకేజ్ ను గ్రహించి పోలీసులను సమాచారం అందించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలోకి చేరుకున్న పోలీసు బృందం.. ఆ ఇంట్లో దంపతులను ఎలక్ట్రిక్ వైర్లతో కట్టివేయడం తోపాటు, వారు రక్తపు పడి ఉన్నట్టు గుర్తించారు.

అంతేకాదు సిలిండర్ నుండి గ్యాస్ లీకేజీని కూడా గమనించారు. తీవ్ర గాయాలైన దంపతులను కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మహిళ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా దోపిడీ దొంగలు దంపతులను పదునైన ఆయుధాలతో తల మీద దాడిచేసి కారుతో సహా విలువైన వస్తువులను దోచుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Similar News