ఒక్క ఉదుటున వచ్చి కొబ్బరిచెట్టును దగ్ధం చేసిన మెరుపు

Update: 2020-06-03 17:31 GMT

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో నిసర్గ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా గుజరాత్ లోని భావనగర్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భావ్‌నగర్‌లోని పాలితానా పట్టణంలో ఒక చెట్టు మీద మెరుపు పడింది. దాంతో కొబ్బరిచెట్టు మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిని ప్రత్యక్షగా చూసిన వ్యక్తి ఇలా అన్నారు "భారీగా వర్షం పడుతుండగా ఒక పెద్ద ఉరుము వచ్చింది.. ఆ వెంటనే నిప్పులాంటి మెరుపు పెద్ద శబ్దంతో కొబ్బరిచెట్టుమీద పడింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లైట్, ఫ్యాన్ ఫ్యూజ్ లు పేలాయి, టివి కూడా పాడైంది. కొబ్బరి చెట్టు ఉండటం వలన తమ ప్రాణాలు దక్కాయని ఆయన అన్నారు.

కాగా IMD ప్రకారం, తూర్పు మధ్య అరేబియా సముద్రంపై నిసర్గా తుఫాను ప్రస్తుతం సూరత్ నుండి 460 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఇది గంటగంటకు "తీవ్రమైన తుఫాను" గా మారుతుంది. నిసర్గ తుపాను మహరాష్ట్ర తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల పెనువేగంతో తుపాను తరుముకొస్తోంది. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు ముంబైలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.

ఇక తుఫానును ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)కు చెందిన 13 బృందాలు , రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) లోని ఆరు బృందాలను వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్ తీరంలో తుఫాను ధాటికి కొండచరియలు విరిగిపడకపోవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సూచించింది.

 

Similar News