ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో సీనియర్ న్యూరో సర్జన్ కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో తక్షణ చర్యగా.. ఆగ్రా జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆసుపత్రిలోని మొత్తం న్యూరో యూనిట్ కు సీలు వేసింది, అంతేకాదు ఆసుపత్రిలో నలుగురు వైద్యులతో సహా 22 మంది సిబ్బందిని క్వారంటైన్ చేసింది. ఆగ్రా-ఢిల్లీ హైవే వద్ద ఉన్న ఈ ఆసుపత్రికి, రాబోయే 48 గంటలపాటు రోగులెవ్వరూ రావద్దని సూచించింది. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. ఆస్పత్రి ఉద్యోగులందరికీ అత్యధిక నాణ్యత కలిగిన రక్షణ గేర్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ ఆగ్రా వైద్య సంఘానికి ఈ వార్త షాక్ ఇచ్చింది.
కరోనా భారిన పడిన డాక్టర్, ఆపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారని సిబ్బంది చెప్పారు.. గత ఏడు రోజులలో ఆ డాక్టర్ ఆపరేషన్ చేసిన రోగులతో సహా సంప్రదింపుల చరిత్రను ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆగ్రా డాక్టర్ ఆర్.సి.పాండే దీనిపై మాట్లాడారు.. ప్రస్తుతం ఆసుపత్రిని నిర్బంధ యూనిట్‌గా పరిగణిస్తున్నామని, సదరు వైద్యుడి పరిచయాలతో సహా ఆసుపత్రి ఉద్యోగులందరికి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆగ్రా ఆసుపత్రులలో కేవలం 73 కోవిడ్ -19 రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారని చెప్పారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నగరంలో 924 గా ఉంటే, వాటిలో 799 మంది పూర్తిగా కోలుకున్నారు.. 44 మంది మరణించారు అని చెప్పారు.