పంతులమ్మ జీతం కోటి రూపాయలు.. అధికారులు షాక్

Update: 2020-06-05 16:32 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 25 చోట్ల పంతులమ్మ పని చేస్తున్నట్లు రికార్డుల్లో ఉండడం అధికారులకు షాకిచ్చింది. పైగా దీని ద్వారా ఆదాయం నెలకు కోటి రూపాయలకు పైనే సంపాదిస్తుందని తెలిసి అధికారులు అవాక్కయ్యారు. ఇటీవల యూపీ ప్రభుత్వం టీచర్ల డిజిటల్ డేటా బేస్ రూపొందిస్తుండగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మెయిన్ పురి జిల్లాకు చెందిన అనామిక శుక్లాగా గుర్తించిన అధికారులు దర్యాప్త్తుకు ఆదేశించారు.

అనామిక శుక్లా ఉత్తరప్రదేశ్ లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రాథమిక విద్యా విభాగం టీచర్ల డిజిటల్ డేటాబేస్ రూపొందిస్తున్న క్రమంలో జిల్లాలలో వేర్వేరు పాఠశాలల్లో ఒకే టీచర్ పని చేస్తున్నట్లు గమనించారు. అమేథి, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, అలీగఢ్ సహా ఇతర 25 పాఠశాలల్లో ఒకేసారి ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలల పాటు కోటి రూపాయలకు పైగా వేతనాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె అందుకు ఏ బ్యాంకు ఖాతాను వాడారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

తక్షణమే ఆమె వేతనాన్ని నిలిపివేస్తూ అధికారులు నోటీసులు పంపించారు. ఈ విషయంపై స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ ఇందులోని వాస్తవాలను పరిశీలించవలసి ఉందన్నారు. ప్రస్తుతం శుక్లా పరారీలో ఉన్నారని చెప్పారు. నిజం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారుల ప్రమేయం ఉంటే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News