తమిళనాడులో కరోనా వైరస్‌తో.. DMK ఎమ్మెల్యే అన్బళగన్ మృతిచెందారు. చెన్నైలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం ఆయన పుట్టిన రోజు.. జన్మించిన రోజే మరణించడం బాధాకరం. దేశంలోనే.. కరోనా వైరస్‌తో చనిపోయిన తొలి ఎమ్మెల్యే ఈయనే. 62 ఏళ్ల అన్బళగన్... చేప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001, 2011, 2016లలో అన్బళగన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత కరుణానిధి, DMK అధ్యక్షుడు స్టాలిన్‌కు అన్బళగన్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను స్టాలిన్ పరామర్శించారు. ఆయన మరణంతో... DMK నేతలు, కార్యకర్తలు, అనుచరులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు.
చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న డాక్టర్ రీలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో ఆయన జూన్ 2న చేరారు. మంగళవారం రాత్రి ఆయన కండిషన్ మరింత సీరియస్‌గా మారింది. బుధవారం ఉదయం అన్బళగన్ మృతిచెందినట్టు.. వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం కూడా.. మరణానికి కారణమన్నారు డాక్టర్లు. డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్‌గానూ.. అన్బళగన్ పనిచేశారు. తమిళంలో నటుడు జయం రవితో ఆదిభగవాన్ చిత్రాన్ని నిర్మించారు. అన్బళగన్ మృతిపై.. తమిళనాడు సీఎం పళనిస్వామి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అన్బళగన్ తండ్రి పజకడి జయరామన్ కూడా గతంలో టి-నగర్ నుంచి గెలుపొందారు. అటు.. తమిళనాట కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. దాదాపు 35 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 307 మంది మృత్యువాతపడ్డారు.