హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రబృందం

Update: 2020-06-10 23:32 GMT

కేంద్రబృందం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలో కరోనా వ్యాప్తిని పరిశీలించింది. జీహెచ్‌ఎంసీని సందర్శించిన కేంద్ర బృందం, కొవిడ్-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. జీహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్ శ్వేత‌మ‌హంతి, జీహెచ్‌ఎంసి అద‌న‌పు క‌మిష‌న‌ర్ సంతోష్‌ తదితరులతో కేంద్ర బృందం స‌భ్యులు వికాస్ గాడే, డా. ర‌వీంద‌ర్‌లు మాట్లాడారు. జీహెచ్‌ఎంసి ప‌రిధిలో జోన్లు, స‌ర్కిళ్లు, వార్డులవారిగా నెల‌కొన్న ప‌రిస్థితి గురించి వాక‌బు చేశారు. జీహెచ్‌ఎంసి ప‌రిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుస‌రిస్తున్న ప‌ద్ధతి, కోవిడ్‌-19 ల‌క్షణాలు క‌నిపించిన వ్యక్తులకు నిర్దారణ పరీక్షలపై ఆరా తీశారు. ప్రస్తుతం నమోదవుతున్న విధంగా కేసులు నమోదైతే జూలై 31 వరకు పరిస్థితి తీవ్రంగా మారు తుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబై, చెన్నైల‌లో ప్రైవేట్ ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల‌లో కోవిడ్‌-19 ప‌రీక్షలు నిర్వహిస్తున్నందున హైదరాబాద్‌లోనూ ప్రైవేట్ టెస్టింగ్‌లకు అవకాశమివ్వాలని సూచించారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో కొవిడ్‌-19 వ్యాప్తిని నియంత్రించడానికి హోం కంటైన్మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న మార్గమని అభిప్రాయపడ్డారు.