వర్షాలు పడకపోతే వరుణ దేవుడిని ప్రార్థించినట్లుగానే.. ఇప్పుడు కరోనా దేవిని వెళ్లమని ప్రార్థిస్తున్నారు కేరళలోని కడక్కల్ లో నివసిస్తున్న అనిలన్ అనే వ్యక్తి. మూడు నెలలుగా కరోనా ముచ్చట్లే. ఎప్పుడు తల్లీ నీ ప్రకోపం చల్లారేది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తావు. ఉన్న వ్యాధులు చాలక కొత్తగా ఈ కరోనా ఒకటి. మరీ దారుణం ఏంటంటే ఒకరికి వస్తే వంద మంది భయపడాల్సిన పరిస్థితి. కలిసిన మాట్లాడిన వారు, కలిసి తిరిగిన వారు అందరూ క్వారంటైన్ కు పరిగెట్టాల్సిందే. అదృష్టం ఉంటే ఇంటికొస్తున్నారు. లేదంటే అంతే సంగతులు.
వైరస్ మహమ్మారిని కట్టడి చేసే మందు ఇంత వరకు కనిపెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ల్యాబ్ లు వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టే పనిమీద ఉన్నాయి.. వారి మీద కరుణ చూపు త్వరగా వ్యాక్సిన్ కనుగొనేలా సహకరించు అని కరోనాని వేడుకుంటున్నారు. వైద్య సిబ్బంది, మీడియా సిబ్బంది, పోలీసులు కరోనా మహమ్మారితో చేస్తున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్నారు. వారి పట్ల కూడా దయ చూపవా అని ప్రశ్నిస్తున్నాడు. కరోనా దేవికి నిత్యం పూజలు చేస్తే మహమ్మారి మనమధ్య నుంచి వెళ్లిపోతుందేమో అని ఆశిస్తున్నాడు.
పూజకు కరోనా దేవి చిత్రపటాన్ని రూపొందించి రోజూ అగరబత్తీలు వెలిగించి అక్షితలు జల్లుతున్నాడు. మున్ముందు మరింత ముప్పు వాటిల్లకుండా మమ్మల్ని విడిచి వెళ్లు తల్లీ అని ప్రతిరోజూ ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనూ అసోం, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగల్ కరోనా వైరస్ కి పూజలు చేశారు.