కరోనాపై చేస్తున్న పోరాటంలో కేరళ.. మిగతా రాష్ట్రాలకు ఆధర్శంగా నిలుస్తుంది. కరోనా నివారణ చర్యలను కఠినంగా అమలు చేస్తూ.. మహమ్మారి నుంచి వచ్చే నష్టాన్ని తగ్గించుకుంటున్నాయి. అన్ని రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తుంటే.. కేరళలో కరోనా ప్రభావం తక్కువగా ఉండటంతో పరీక్షలు నిర్వహించింది. అయితే, పరీక్షలు పూర్తై 14 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకూ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని కేరళ ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ థామస్ ఇస్సాక్ ట్వీట్ చేశారు. మొత్తం 13 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షల్లో పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నామని.. శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లు ప్రతీరోజు జరిపించి విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించామని అన్నారు. మొత్తం 3000 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని.. విద్యార్థులకు 25 లక్షలకు పైగా మాస్కులు పంపిణీ చేశామని తెలిపారు.