చైనా రాజధాని బీజింగ్ లో మళ్లీ వైరస్ ఊపందుకుంది. వ్యాప్తి విస్తృతమవుతోంది. బీజింగ్ లోని జింఫాడీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ వైరస్ వ్యాప్తి కారణమవుతోందని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా 30 కేసులు నమోదు కావడంతో వారందరినీ విచారించగా మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారేనని తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం వైరస్ వ్యాప్తి నివారణకు సమాయత్తమైంది. బీజింగ్ పౌరులను కొద్ది రోజు పాటు నగరం దాటి వెళ్లవద్దని, ప్రయాణాలు మానుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
బుధవారం నుంచి అక్కడ స్కూళ్లు, కాలేజీలు మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన వారం రోజుల్లో 137 కొత్త కేసులు నమోదయ్యాయి. రాకపోకలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఏకంగా 70 శాతం విమానాలను రద్దు చేశారు. 1255 విమానాలు.. విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి. నగరంలో కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ట్రావెల్ బ్యాన్ ను కూడా విధించారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణించవలసి వస్తే వారికి న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు చేస్తున్నారు.