పాకిస్తాన్‌కు చెందిన స్పై డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

Update: 2020-06-20 16:38 GMT

సరిహద్దుల్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటు భారత్‌-చైనా సరిహద్దు వెంటబడి యుద్ధ వాతావరణం నెలకొనగా, అదే సమయంలో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదును చూసుకుని దాడులకు తెగబడుతోంది. అయితే, అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం దయాది దేశం దుష్ట పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. జమ్ము కశ్మీర్‌లోని కతువా జిల్లాలో పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చివేశారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. తెల్లవారుజామున 5.10 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

హిరనగర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన స్పై డ్రోన్‌ భారత భూ భాగంలోకి చొచ్చుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆ డ్రోన్‌ను కూల్చేశారు. బీఎస్‌ఎఫ్‌ 19వ బెటాలియన్‌ జవాన్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా డ్రోన్‌ ఎగురుతూ కనిపించింది.. తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపిన జవాన్లు డ్రోన్‌ను కూల్చేశారు. డ్రోన్‌ నుంచి ఎం-4 యూఎస్‌ మేడ్‌ రైఫిల్‌తోపాటు రెండు మేగజిన్లు, 60 రౌండ్ల బుల్లెట్లు, 7 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకే డ్రోన్‌ను పంపినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.

Similar News