చైనా విషయంలో యావత్ దేశమంతా ఒక్కటై ప్రధాని మోదీ వైపు నిలబడితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా దురాక్రమణకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శలు చేశారు. మన భూభాగాన్ని చైనాకు అప్పగించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ ఆ భూభాగం చైనాదే అయితే, మరి మన సైనికుల్ని ఎందుకు చంపారని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ప్రధానిని ప్రశ్నించారు. అలా అయితే, భారతీయ సైనికుల్ని ఏప్రాతంలో చంపారో చెప్పాలన్నారు. మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమేనని నిన్నటి అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు.. అయితే, నిన్నటి ప్రధాని మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. దేశప్రజలంతా ప్రధానికి మద్దతు తెలుపుతుంటే, రాహుల్ ఇలాంటి విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.