పగ, ప్రతీకారం.. భార్యను, అత్తను హతమార్చి తానూ..

Update: 2020-06-25 14:48 GMT

క్షణికావేశంతో హత్యలు చేస్తున్నారు.. అదే క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అమిత్ అగర్వాల్ ఆవేశంతో భార్యను, అత్తను హత మార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ కోల్ కతాకు చెందిన శిల్పి అగర్వాల్ ను వివాహం చేసుకున్నారు. వీరికి పదేళ్ల వయసుగల కొడుకు ఉన్నాడు. భార్యా భర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవ తారా స్థాయికి చేరడంతో ఆమెను అక్కడే హత మార్చాడు.

అక్కడి నుంచి కోల్ కతాకు కొడుకుని తీసుకుని విమానంలో వెళ్లాడు. కుమారుడిని సోదరుడికి అప్పగించి అత్త లలిత ఇంటికి వెళ్లి ఆమెను కాల్చి చంపాడు.. మామ సుభాష్ ను కాల్చబోతే ఆయన తప్పించుకుని బతికిపోయారు. అనంతరం అమిత్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుభాష్ పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి చూసేసరికి అమిత్, అత్త లలిత రక్తపు మడుగులో కనిపించారు.

మృతుడు అమిత్ మృత దేహం వద్ద 67 పేజీల సుధీర్ఘ సూసైడ్ నోట్ లభించింది. 66 పేజీలను టైప్ చేసి చివరి పేజీ చేతి రాతతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యతో ఉన్న గొడవ కారణంగా ఆమె కుటుంబసభ్యులందరినీ హతమార్చాలని అమిత్ ప్లాన్ వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అమిత్ ఇంటిలో భార్య శిల్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News