సీఎంతో పాటు 51 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు..

Update: 2020-06-29 14:56 GMT

పుదుచ్చేరిలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర సీఎం వద్ద గన్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి తండ్రికి కరోనా వైరస్ సోకింది. దీంతో సీఎం వి. నారాయణస్వామితో పాటు అతని కార్యాలయంలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. సీఎం నారాయణస్వామితో పాటు ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు 51 మందికి పీటీ-పీసీఆర్ పరీక్షలు చేశారు.

అయితే రిపోర్టులో సీఎం నారాయణస్వామితో పాటు 51 మంది సీఎం కార్యాలయ ఉద్యోగులకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరు మోహన్ కుమార్ చెప్పారు. అయినా ముందు జాగ్రత్తగా సీఎం నారాయణస్వామితోపాటు ఉద్యోగులకు వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించామని డైరెక్టరు తెలిపారు. కాగా పుదుచ్చేరిలో ఇప్పటివరకు 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుండి 252 మంది కోలుకున్నారు.

Similar News