కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయోగాలు ఓ కొలిక్కి రానున్నాయి. మొన్నటికి మొన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని ప్రకటించింది. తాజాగా జర్మనీకి చెందిన బయోఎన్ టెక్, అమెరికాకు చెందిన ఫిజెర్ కంపెనీలు నాలుగో దశలో మనుషులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని ప్రకటించింది. దీంతో మనుషులపై ప్రయోగాలు జరుపుతున్న వ్యాక్సిన్ ప్రయోగశాలల సంఖ్య 17కి చేరుకుంది. ఈ రెండు కంపెనీల షేర్ మార్కెట్ కూడా పెరిగింది.
బయోఎన్ టెక్ రూపొందించిన వ్యాక్సిన్.. బీఎన్ టీ 162బీ1 అనే మందును 24 మంది వాలంటీర్లకు ఇవ్వగా 28 రోజుల తర్వాత వారి శరీరంలో పెద్ద మొత్తంలో కరోనా వైరస్ యాంటీ బాడీస్ తయారయ్యాయని తెలిపింది. వీరికి మూడు వారాల్లో రెండు డోసుల చొప్పున ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలిపింది. రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి నలుగురిలో ముగ్గురికి స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లు వివరించింది. మరో గ్రూప్ వారికి ఎక్కవ మోతాదులో ఒకసారి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు గుర్తించారు.
మరి కొద్ది రోజులు ఈ ట్రయల్స్ నిర్వహించి పూర్తి ఫలితాలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బయోఎన్ టెక్ సీఈవో సాహిన్. అన్ని అనుమతులు లభించిన తరువాత జూలై చివరి నాటికి అమెరికా, యూరోప్ లోని 30 వేల మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై బయోఎన్ టెక్, ఫిజర్ వ్యాక్సిన్ లు ఇచ్చి పరీక్షిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తే 2020 డిసెంబర్ నాటికి కోటి వ్యాక్సిన్లు, 2021 చివరకు 120 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేయాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంది.