మరోసారి మంచి మనసు చాటుకున్న గౌతం గంభీర్

Update: 2020-07-02 17:47 GMT

బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తోటి వారికి సాయం చేయడంలో ముందుటారు. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి తన వంతు సాయం అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్న గౌతం మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆస్పత్రుల్లో బెడ్లు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ 50 పడకల గల ఐసోలేషన్ సెంటర్ ను సిద్ధం చేసి గురువారం ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించారు.

గంభీర్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కోవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. మొత్తం 50 పడకలతో రూపొందించిన ఈ ఐసోలేషన్ సెంటర్ లో ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించారు. గంభీర్ మాట్లాడుతూ.. కరోనా సోకినవారు ఎవరైనా సరే ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడకు వచ్చే కరోనా బాధితులకు మా సెంటర్ లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మానవతాదృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. అందుకే ఈ ఐసోలేషన్ సెంటర్ ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాను అని అన్నారు. త్వరలో ఇతర ప్రాంతాలలో కూడా తమ ఫౌండేషన్ ద్వారా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా బాధితులను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ ప్రభుత్వం పలు ఫంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి కొవిడ్ ఆస్పత్రులకు అనుసంధానించింది.

Similar News