షూటింగులు లేక దాదాపు నాలుగు నెలలైంది. కళామతల్లినే నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు బతుకుతుంటాయి. వాళ్లందరికీ ఇది అత్యంత కష్టకాలం. చేయడానికి వేరే పనులు కూడా దొరకని పరిస్థితి. ఉన్న వాళ్లనే తగ్గించుకుంటున్నాయి కొన్ని వ్యాపార సంస్థల నుంచి మొదలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం. ఇక వీరికి బ్రతికేందుకు జీవనాధారం లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు జూనియర్ ఆర్టిస్టులను, సినీ కార్మికులను ఆదుకునేందుకు పెద్ద మొత్తంలో సాయం అందించారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 200 మంది డ్యాన్సర్లకు నగదు సహాయం చేశాడు. వరుణ్ కు డ్యాన్స్ అంటే ఎంతో మక్కువ. డ్యాన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఎబిసిడి2, స్ట్రీట్ డ్యాన్సర్ సినిమాల్లో నటించాడు. వరుణ్ నృత్య కళాకారులకు సాయం చేసిన విషయాన్ని ప్రముఖ సినీ కో ఆర్డినేటర్ రాజ్ సురానీ ప్రకటించారు. నిరుపేద కళాకారుల సమస్యలను సైతం పరిష్కరిస్తామని, త్వరలోనే వారికి జీవనోపాధి కల్పిస్తామని వరుణ్ హామీ ఇచ్చారని సురానీ తెలిపారు.