ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువ. అక్కడి జనసాంద్రత, ఆ మురికివాడలోని వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. అయితే, అక్కడ కరోనా కట్టడిలో భాగంగా తీసుకుంటున్న చర్యలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసించింది. ప్రాణాంతక వైరస్ పై ముంబైలోని దారావి విజయం సాధించిందని కొనియాడింది. కరోనా పరీక్షలు, కరోనా రోగులుకు అందిస్తున్న తక్షణ చికిత్స, ఐసోలేషన్ నిబంధనలను అమలు చేసే విధానం.. వైరస్ గొలుసుకు బ్రేక్ వేసాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తరువాత కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ ను తరిమికొట్టారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియాతోపాటు ముంబైలోని ధారావి వంటి ప్రాంతాలను చూసిన తరువాత.. కేసులు పెరిగినా.. మహమ్మారిని అదుపుచేయవచ్చనే నమ్మకం కలిగిందని అన్నారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను కఠినంగా అమలు చేయడమే దీనికి కారణమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేశారు.
పదిలక్షలకు పైగా నివసించే అతి చిన్న ప్రాంతమైన ధారావిలో.. కరోనా లాంటి వైరస్ ల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భారత్ లో కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదయ్యేవి. దీంతో ముంబై పురపాలక సంస్థ సత్వర చర్యలు చేపట్టింది. వైద్యసిబ్బందిని, శానిటరి సిబ్బందిని పంపించి సత్వర చర్యలు చేపట్టింది. ధారావి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించింది. దీంతో శుక్రవారం వరకూ 2359 కేసులు నమోదుకాగా.. కేవలం 166 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా.. డిశ్చార్జ్ అయ్యారు.