బచ్చన్ ఫ్యామిలీలో ముగ్గురు అమితాబ్ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య.. కరోనా బారిన పడ్డారు. అమితాబ్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు, సెలబ్రెటీలు, పలువురు రాజకీయ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను, నర్సులను చూసి అమితాబ్ చలించి పోయారు. దేశంలో వివిధ ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఉద్ధేశించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు తమ సేవలందిస్తున్నారు. నేను ఈ మధ్య సూరత్ లో చూసిన ఓ బోర్డును ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. అందులో ఇలా రాసి ఉంది. మహమ్మారి కారణంగా దేవాలయాలు ఎందుకు మూసివేశారో తెలుసా దేవుళ్లంతా తెల్లకోటు వేసుకుని ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తున్నారు అని ఉంది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. అయినా వారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుడి కృపకు పాత్రులవుతున్నారు.
నేను వైద్యులకు, వైద్య సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు లేకపోతే మనుషులంతా ఏమైపోయేవారో. వైద్యులంతా వారి పరిధులు దాటి పని చేస్తున్నారు. అందరిలో కొవిడ్ గురించిన భయం నెలకొని ఉంది. కానీ భయపడవద్దు. ధైర్యంగా ఎదుర్కోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిది అని అన్నారు. నానావతి హాస్పిటల్ సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని వీడియోలో తెలిపారు అమితాబ్.