రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రస్తుతానికి మెత్తబడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గెహ్లాట్, పైలట్ మధ్య రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు. ప్రియాంక గాంధీ సూచనలతో సచిన్ పైలట్.. అశోక్ గెహ్లాట్ కు సహకరించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా పైలట్ పలు డిమాండ్లను పార్టీ ముందుంచినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలకమైన ఆర్థిక, హోంశాఖలను ఇవ్వాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతకుముందు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ వెనుక నడవాలని నిర్ణయించుకున్నారు. కాగా 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు.