ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదల ప్రభావం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల వల్ల ప్రమాదాలకు గురై వేర్వేరు చోట్ల మొత్తం 71 మంది మృతి చెందారు. వీరిలో 26 మంది కొండ చరియలు విరిగి పడి మృతి చెందిన వారు ఉన్నారు. ఈ వరదలు మొత్తం 27 జిల్లాలను ప్రభావితం చేసిందని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ తెలిపింది. మొత్తం 4,766 గ్రామాలకు చెందిన 40 లక్షల మందికిపైగా ప్రజలపై వరదల ప్రభావం పడిందని అన్నారు. ఆవాసాలు కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులకోసం 445 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.