రాజస్థాన్ లో అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించాలని బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మోసం చేశారని అన్నారు. అక్కడ నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, రాజకీయ తిరుగుబాట్లను గవర్నర్ దృష్టికి తీసుకురావాలని ఆమె ఇతర పార్టీల నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని అన్నారు.
అశోక్ గెహ్లాట్ ఇప్పుడు ఫోన్ టేపుల ద్వారా మరొక చట్టవిరుద్ధమైన , రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు తెరలేపారని మాయావతి విమర్శించారు. ఇదిలావుంటే రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 సీట్లలో పోటీ చేసి 100 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్‌దళ్ నుంచి ఒక సభ్యుడు, బిఎస్పి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరంతా అప్పట్లో కాంగ్రెస్ లో చేరిపోయారు.