కొద్దిరోజులుగా గాల్ బ్లాడర్ వాపుతో అనారోగ్యానికి గురైన సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం సల్మాన్‌ను రాజధాని రియాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించినట్లు సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో 84 ఏళ్ల సల్మాన్ ను పరీక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే చికిత్స అనంతరం ఆయనకు కొద్దిరోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. కాగా సల్మాన్ జనవరి 2015 నుండి సౌదీ రాజుగా అధికారంలో ఉన్నారు. ఆయన తండ్రి మరియు సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు కింగ్ అబ్దులాజీజ్ మరణానంతరం వారసత్వంగా ఆయనకు అధికారం వచ్చింది.
ఇక సల్మాన్ తన 34 ఏళ్ల కుమారుడు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ను తన వారసుడిగా ప్రకటించారు. ఇప్పుడు ఆయనే సౌదీకి అనధికార రాజుగా కొనసాగుతున్నారు. పరిపాలన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. కాగా మహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో అనేక సంస్కరణలకు కారణమయ్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్పద నాయకుడిగానూ ముద్ర పడింది. జర్నలిస్ట్ ఖషోగ్గీని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.