మెగాస్టార్ కోడలిగా, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ మనవరాలిగా అన్నింటికీ మించి సేవాతత్పరత మెండుగా ఉన్న ఉపాసన ఏది చేసినా భిన్నంగానే ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాసన రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. నెహ్రూజూపార్క్ కు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి సంవత్సరం పాటు రాణి పోషణకు కావలసిన సౌకర్యాలను తాను అందిస్తానని చెప్పారు. ఇందుకు గాను రూ.5 లక్షల చెక్కును జూ అధికారులకు అందజేశారు. కరోనా సమయంలో జూ నిర్వహణ కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జంతువులను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రాణిని దత్తత తీసుకున్నందుకు జూ అధికారి క్షితిజ ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేశారు.