రోడ్డుకు అడ్డంగా ఉందని 400 సంవత్సరాల పురాతన మర్రి చెట్టును నరికివేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇంతలో ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకొని ఆ చెట్టు కూల్చివేతను నిలిపివేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలోని భోస్ గ్రామ ప్రజలు 400 సంవత్సరాల పురాతన మర్రి చెట్టును నరికివేయకుండా కాపాడుకున్నారు. మర్రిచెట్టు రాష్ట్ర రహదారి మధ్యలో ఉంది. దాంతో ఈ చెట్టును నరికివేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని భావించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చెట్టు చుట్టూ నిలబడి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎట్టి పరిస్థితులలో ఈ చెట్టును నరకవద్దని నినాదాలు చేశారు.
ఈ వార్త రాష్ట్ర పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రేకు చేరింది. దీని గురించి ఆయన కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. దాంతో చెట్టు వద్ద నుంచి కాకుండా దాదాపు 15 మీటర్ల పక్కనుంచి రోడ్డు వేయాలని అభికారులు నిర్ణయించారు. కాగా ఈ మర్రి చెట్టు రత్నగిరి-సోలాపూర్ హైవేలోని యెలమ్మ ఆలయానికి సమీపంలో ఉంది. దాదాపు 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దశాబ్దాలుగా ఇది ఇక్కడి ప్రజల సనాతన సంప్రదాయంతో ముడిపడి ఉంది. అందుకే ఈ మర్రిచెట్టుకోసం పెద్దఎత్తున గ్రామస్థులు ఉద్యమించారు.