పిలవని పేరంటానికి 'కరోనా'.. పెళ్లి పందిట్లో తిష్ట.. 43 మందికి..

Update: 2020-07-27 16:49 GMT

ఊరంత పందిరి వేసి ఊళ్లో వాళ్లందరినీ పిలిచి జీవితంలో ఒక్కసారి చేసుకునే వివాహ వేడుకలను కరోనా వచ్చి కట్టడి చేసింది.. 50 మంది కంటే ఒక్కళ్లెక్కువయినా సర్కార్ ఊరుకోనంటూ హుకూం జారీ చేసింది. అయినా ప్రభుత్వం మాటని పెడచెవిన పెట్టి 125 మందిని ఆహ్వానించారు కేరళలోని కేస‌ర్‌గాడ్ జిల్లా పిలంకట్ట గ్రామానికి చెందిన ఓ కుటుంబం. జూలై 17న 125 మంది అతిధుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించింది. సర్కార్ మాటకి విలువ లేదు.. నేనంటే కూడా భయం లేకుండా పోతోందా మీకు అని 125 మందిలో 43 మందిపై దాడి చేసింది మహమ్మారి కరోనా.

పిలవని పేరంటానికి తగుదునమ్మా అని కొవిడ్ తయారైపోయి పెళ్లి పందిట్లోకి చొరబడి పోయింది. అతిధుల్లో ఎవరికి కొవిడ్ ఉందో తెలియదు. పెళ్లైన వారానికి వధువు తండ్రి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీస్కెళ్లి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో పెళ్లికి హాజరైన వారందరూ పరీక్షలు చేయించుకోగా నూతన వధూవరులతో సహా 43 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది అతిధులను పిలిచి వివాహం జరిపినందుకుగాను పోలీసులు పెళ్లికూతురు తండ్రిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడికి రెండేళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

Similar News