కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గటంలేదు. దీంతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఖాళీగా ఉంటే.. మరికొంత మంది మాత్రం జీతాలు తగ్గించుకొని విదులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆ జీతాలు కూడా సమయానికి అందకపోవడంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలపై పడుతున్నారు. చాలామంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాల నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 30 వేల కోట్ల విత్‌డ్రా చేసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలనుంచి అవసరాలకు డబ్బులు తీసుకున్నారు. ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువగా పీఎఫ్ ఖాతాలనుంచి విత్ డ్రా చేసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా నేపధ్యంలో.. ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోత విధించడం, ఈ కరోనా సమయంలో పెరుగుతున్న వైద్య ఖర్చులే పీఎఫ్ ఖాతాల ఉపసంహరణకు కారణాలని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి... ఫండ్ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.