సాయంలో ముందుండే సోను.. ఆస్తుల విలువ..

Update: 2020-07-28 15:45 GMT

ఆపదలో ఉన్నవారికి అడక్కుండానే సాయం చేస్తున్నారు.. ఇంతకీ ఆయన ఆస్తి విలువ ఎంతేంటి అని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ని ప్రశ్నిస్తున్నారు ఆసక్తి, అనుమానం ఉన్న కొందరు. ఎంత ఆస్తి ఉన్నా పెట్టే మనసు కూడా ఉండాలిగా అని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించినా నిజ జీవితంలో మాత్రం ఆపన్నులను ఆదుకుంటూ నిజమైన హీరో అనిపించుకుంటున్నారు.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సోనూ కరోనా కాలంలో వలస కార్మికులకు అండగా నిలబడ్డారు. ఎక్కడ ఆపద వస్తే అక్కడ నేనున్నానంటూ సాయంలో ముందుంటున్నారు. సోనూ సాయం పొందిన వారు అతడిని దేవుడిలా కొలుస్తున్నారు.. ఇప్పటి వరకు తాను సంపాదించిన కోట్ల విలువైన ఆస్తి కంటే వారి ప్రేమ ఎంతో గొప్పదని సోనూ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కోట్ల ఆస్తులను కూడబెట్టిన రాజకీయ నాయకులు, సినీ తారలు చేయలేని పనులు సోనూ చేస్తుంటే ఆయన ఆస్తుల విలువపై చర్చ వచ్చింది.

తాజాగా బాలీవుడ్ మీడియా సోనూ ఆస్తులపై అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ రూ.130 కోట్లని, ఇప్పటి వరకు ఆయన ఖర్చు చేసింది రూ.10 కోట్లని తేల్చింది. ముంబైలో పెద్ద ఇల్లు, హోటల్స్ ఉన్నాయి. ఇటీవల తన హోటల్ ని వైద్యుల కోసం కేటాయించి తన మంచి మనసును చాటుకున్నారు. సాయం చేసిన వారు మర్చిపోవాలి.. కానీ సాయం పొందిన వారు మాత్రం ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అనే మాటలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు సోనూ సూద్.

Similar News