మాజీ మంత్రి ఖలీల్ బాషా కన్నుమూత..

Update: 2020-08-12 14:46 GMT

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డా. ఎస్ఏ ఖలీల్ బాషా మంగళవారం హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూశారు. రెండు రూపాయల ఫీజుతో వైద్యం చేస్తూ ప్రజల ఆదరాభిమానులు చూరగొన్న వైద్యుడిగా ప్రాచుర్యంపొందారు. ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లో ప్రవేశించి 1994,1999లలో కడప నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు. అనంతరం నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

2019 ఎన్నికలకు ముందు తన ముగ్గురు కుమారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వయసు మీదపడినా డాక్టర్ వృత్తిని కొనసాగించారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న క్రమంలోనే ఆయన వైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతుండగా మూడు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో పరిస్థితి విషమించి మంగళవారం సాయింత్రం తుది శ్వాస విడిచారు. ఖలీల్ బాషా మృతికి పలువురు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. కాగా, బాషా అంత్యక్రియలు కడపలోని ఆయన స్వగృహం వద్ద జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News