AMARAVATHI: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
అమరావతికి చట్టబద్ధత... కేంద్ర న్యాయ శాఖ ఆమోద ముద్ర
అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందుగా ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవరించాలి. ఈ చట్టంలో అమరావతే రాజధాని అనే మాట ఎక్కడా లేదు. దీంతో ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీంతో పునర్ విభజన చట్టంలో మార్పులకు కేంద్ర న్యాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ బిల్లును లోక్ సభ, రాజ్యసభల్లో పెట్టి ఆమోదించాల్సి ఉంది.
న్యాయ శాఖ ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్దిరోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత.. త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేస్తారు. విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని తెదేపా ప్రభుత్వం ఎంపికచేసింది. 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే అక్కడ అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో.. అమరావతి పనులు నిలిచిపోయాయి.