ARREST: ఎమ్మెల్యే కుమారుడి అరెస్టుతో కలకలం
డ్రగ్స్ దందాపై ఈగల్ ఉక్కుపాదం
ఏపీ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ వినియోగిస్తూ హైదరాబాద్ ఈగల్ టీంకు చిక్కాడు. గంజాయి తీసుకుంటూ కడప జిల్లా జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి దొరికాడు. పక్కా సమాచారం అందడంతో.. ఇంటికి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయగా… సుధీర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసులో సుధీర్ రెడ్డి పట్టుబడినట్లు సమాచారం. సుధీర్ రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేశారన్న కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ మంత్రిగా పనిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ రెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం సుధీర్ రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి, నిబంధనల ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మళ్లీ డ్రగ్స్ కేసులోనే...
గతంలోనూ మాదక ద్రవ్యాల వినియోగం కేసుల్లో సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఎలాగోలా తప్పించుకున్న ఆయన.. మరోసారి డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినట్లు సమాచారం. గతంలో టీడీపీ, వైఎస్సార్సీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తన కుమారుడు పట్టుబడటంతో దీనిపై బీజేపీ లేదా కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సుధీర్ రెడ్డి ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం ఇదే మొదటిసారి కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా రెండుసార్లు ఇదే తరహా మాదకద్రవ్యాల కేసుల్లో ఆయన పోలీసులకు దొరికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వరుసగా మూడోసారి డ్రగ్స్ కేసులో చిక్కడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.