అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ చోరీ జరిగింది. గోల్డ్ లోన్ సంస్థను నమ్మి ప్రజలు బంగారం తాకట్టు పెడితే ఇంటి దొంగలు వాటిని కాజేశారు. ఇంటిదొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరవకొండలో ఓ ప్రైవేటు గోల్డ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు బంగారంపై రుణాలు ఇస్తున్నారు.. దీంతో డబ్బులు అవసరం నిమిత్తం పట్టణ ప్రజలు ఈ సంస్థలో బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు. అంతేకాదు తీసుకున్న రుణానికి ప్రతి నెల వడ్డీ కడుతున్నారు. అయితే ఆ బంగారంపై ఆ సంస్థలో పనిచేసే వారి కన్నుపడింది. కొద్ది కొద్దిగా చోరీ చేశారు. ఇందులో మేనేజర్ హస్తం కూడా ఉందని పోలీసులు తేల్చారు. ఉద్యోగులతో కలిసి మేనేజర్ పక్కా ప్లాన్ ప్రకారం బంగారాన్ని కొట్టేశారు. రూ. 56 లక్షల విలువైన 1,158 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. సంస్థ యాజమానికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిదొంగల గుట్టు రట్టయింది. మేనేజర్ సహా నలగురు ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఈ విషయం బయటకు తెలియడంతో గోల్డ్ తాకట్టు పెట్టిన వారంతా స్థానికంగా ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.