Chandra Babu : నవరత్నాలు అని చెప్పి.. నవ కోతలు పెడుతున్నారు : చంద్రబాబు
Chandra Babu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు.;
Chandra Babu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. శాంతిపురం మండలం కొంగణపల్లి, కొల్లుపల్లెలో రోడ్‌షో నిర్వహించారు. అధినేతకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగుడుగునా మహిళలు హారతులు పట్టారు.
కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానిది శీతకన్ను అంటూ మండిపడ్డారు చంద్రబాబు. తన నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఈ పర్యటన అన్నారు. టీడీపీ హయాంలోనే కుప్పం అభివృద్ధి చెందిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. జగన్‌వి నవరత్నాలు కావు... నవ కోతలంటూ నిప్పులు చెరిగారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు డ్రామాలు మొదలు పెట్టారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రౌడీలను తయారుచేసి ఉసిగొల్పుతుంటే భయపడే ప్రసక్తి లేదన్నారు. కుప్పంను పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
అంతకముందు చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఘర్షణ వాతావరణం సృష్టించారు. చంద్రబాబు రాకను తెలుసుకుని... వైసీపీ కార్యకర్తలు తమ జెండాలను కట్టారు. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ జెండాలను టీడీపీ కార్యకర్తలు చించేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు ఎస్‌ఐలు కూడా గాయపడ్డారు. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, చెదరగొట్టారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఓ ఇంట్లో పెట్టి తాళాలు వేశారు.
ఓవైపు చంద్రబాబు పర్యటిస్తుంటే.... తమకు పోటీగా వైసీపీ జెండాలు కట్టడంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా... కుప్పం ప్రజలు మాత్రం చంద్రబాబు వెన్నంటే నిలిచారు. అధినేత పర్యటనను టీడీపీ కార్యకర్తలు విజయవంతం చేశారు. పోలీసులు.. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డుతున్నాయి.