ఈ రోడ్లు.. నరకానికి నకళ్లు
తుఫాన్ , భారీ వర్షాలకు రాష్ట్రంలో పలు రహదారులు చెరువులు;
రాష్ట్రంలో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. అసలే గోతులు, గుంతలతో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లు కాస్తా..తుపాన్ దెబ్బకు మరింత దారుణంగా తయారయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై పారుతుండటంతో గుంతలు కనిపించక వాహనదారులు కిందపడిపోతున్నారు. కాకినాడ-సామర్లకోట రహదారిపై ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 11 నియోజకవర్గాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉందంటే..జగనన్న పాలనలో ఇక గ్రామీణ రోడ్ల సంగతి చెప్పక్కర్లేదు.
అడుగుకొక గుంత...ఆపైన భారీ గొయ్యిలు.. గోతుల మధ్య రహదారి ఎక్కడ ఉందో వెతుక్కుని వాహనాలు నడపాల్సి వస్తోంది. ఇదీ కాకినాడ- సామర్లకోటలో రోడ్డులో ప్రయాణికుల దుస్థితి. కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికే గంటకు పైగా సమయం పడుతోంది. ముత్యాలమ్మ గుడి నుంచి మాధవపట్నం గ్రామ శివారు వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. తుపాన్ ప్రభావంతో గోతులన్నీ నీటితో నిండిపోవడంతో... వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గోదావరి కాల్వకు తూములు వేసి పూడ్చివేశారు. వరద కాల్వలో పోటెత్తడంతో రోడ్డును ముంచెత్తింది. దీంతో వాహనదారుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యం కీలకమైన ఈ రహదారిపై దాదాపు 11 నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాకినాడ నగరానికి వెళ్లే అతి ప్రధాన రహదారి ఇదే కావడంతో నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు ఈ రోడ్డు మీదే ప్రయాణిస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ రహదారిని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం గుంతలు పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.రహదారిపై గోతుల్లో కనీసం తట్టెడు మట్టి వేసి పూడ్చాలంటూ ప్రయాణికులు వేడుకుంటున్నారు.