ED: మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
ఏపీ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంటూ ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు కీలక నేతలు, వ్యాపార వర్గాలపై విచారణ సాగుతున్న నేపథ్యంలో మిథున్‌రెడ్డికి నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మద్యం విధానంలో చోటుచేసుకున్న నిర్ణయాలు, వాటి అమలులో భాగంగా జరిగిన లావాదేవీలపై విస్తృతంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, కంపెనీల లావాదేవీలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఆ విచారణలో లభించిన కొన్ని కీలక అంశాల ఆధారంగానే మిథున్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వరుసగా వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు నోటీసులు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసులో ప్రధానంగా నిధుల మళ్లింపు, అక్రమ నగదు ప్రవాహం, కొన్ని సంస్థల మధ్య అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేకంగా విచారణ సాగుతోంది. లిక్కర్ విధానం అమలులో భాగంగా కొన్ని ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు జరిగాయా? వాటి వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందా? అనే కోణాల్లో ఈడీ లోతుగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి నుంచి కీలక వివరణలు రాబట్టేందుకు విచారణ కీలకంగా మారినట్లు తెలుస్తోంది.