I BOMMA RAVI: నోరు మెదపని ఐ బొమ్మ రవి
ఐ బొమ్మ రవి దమ్మునోడు: తీన్మార్ మల్లన్న
ఐబొమ్మ రవి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం విచారణలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ స్వయంగా రవిని విచారించారు. సైబర్ క్రైమ్ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. రవి మీద ఇప్పటివరకు ఐటీ, చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం, గోప్యతకు భంగం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా నిన్న ఫారినర్స్ యాక్ట్ జోడించారు. రవి ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్లను జోడించారు.
"ఐ బొమ్మ రవి దమ్మునోడు"
ఐ బొమ్మ, బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. తాజాగా దీనిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ఆయన చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐబొమ్మ రవి దమ్మున్న వాడని, అందుకు ప్రజలంతా అతనికి మద్దతిస్తున్నారన్నారని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. రవి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వకపోయి ఉంటే పోలీసులు అతడిని పట్టుకునేవారే కాదన్నారు. ఇకనైనా పోలీసులు సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని సూచించారు.
సజ్జనార్‌పై ఆగ్రహం
వంద రూపాయల టికెట్ ను వేలల్లో అమ్ముకునే సినిమావాళ్లేమైనా సంసారులా? అని ప్రశ్నించారు. సీపీ సజ్జనార్ సినిమా వాళ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడంపై కూడా మండిపడ్డారు. సజ్జనార్ చేసేవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లని, వరంగల్ లో కూడా అదే చేశారని ఆరోపించారు. దమ్ముంటే దేశంతో జరుగుతున్న సైబర్ క్రైమ్స్, కిడ్నాప్ లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు. ఇలాంటి సైబర్ మోసాలు ఎప్పటికీ ఆగవని సీవీ ఆనంద్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొందరు మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖను అగౌరవ పరిచారని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మల్లన్న ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.