KANUMA: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కనుమ పండుగ

పశువులే అసలైన సంపద: చంద్రబాబు

Update: 2026-01-16 03:30 GMT

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనుమ పండుగను ప్రజలు ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. కనుమ అనేది రైతు జీవన విధానానికి ప్రతీక. పంటలు పండించిన భూమికి, ఆహారాన్ని అందించిన పశువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది. వ్యవసాయ ఆధారిత సమాజంలో ఎద్దులు, ఆవులు వంటి పశువులు రైతుకు వెన్నెముకలాంటివి. అలాంటి పశువులను అలంకరించి, పూజించి, వాటికి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం కనుమ యొక్క ప్రధాన విశేషం. ఈ పండుగ ద్వారా మన పూర్వీకులు ప్రకృతితో, జంతువులతో ఉన్న అనుబంధాన్ని తరతరాలకు అందించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో కనుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు ముగ్గులు వేసి, రంగురంగుల పూలతో ప్రాంగణాలను అలంకరించారు. ఆవులు, ఎద్దులకు పసుపు, కుంకుమ పెట్టి, గంటలు కట్టి, పూల దండలు వేశారు. కొందరు రైతులు తమ పశువులను గ్రామ దేవాలయాల చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదా?

మకర సంక్రాంతి మరుసటి రోజు జరుపుకునే 'కనుమ' పశువుల పండుగ. వ్యవసాయానికి సహకరించే పశువులకు రైతులు కృతజ్ఞతగా పూజలు నిర్వహించి.. వాటికి పూర్తి విశ్రాంతినిస్తారు. పశువులను కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే 'కనుమ రోజు కాకైనా కదలదు' అని ప్రయాణాలను నిషేధించారు. పండుగ సమయంలో వచ్చిన బంధుమిత్రులు వెంటనే వెళ్లిపోకుండా అందరితో ఆనందంగా సమయం గడిపి, కష్టసుఖాలను పంచుకొనేందుకు వీలుగా కూడా ఈ నియమం పెట్టారని చెప్పొచ్చు. కనుమ.. ముక్కనుమ విశిష్టత ఏంటికనుమ, ముక్కనుమ పండుగలు సంక్రాంతి సంబరాల్లో కీలకమైనవి. కనుమ నాడు రైతులు పశువులను అలంకరించి, గోపూజ చేసి కృతజ్ఞత తెలుపుతారు. పొలాల్లో పులగాన్ని చల్లుతారు. నాలుగో రోజైన ముక్కనుమ నాడు మహిళలు గౌరీ వ్రతం, బొమ్మల కొలువు నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు శాఖాహారం తిన్న వారు, ముక్కనుమ రోజున మాంసాహార విందులతో పండుగను ఘనంగా ముగిస్తారు. ఇళ్లు తోరణాలతో కళకళలాడుతాయి.

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారు?

సంక్రాంతి పండుగ ముగింపు రోజైన కనుమ నాడు రథం ముగ్గు వేయడం మన ఆచారం. మానవ దేహమనే రథానికి పరమాత్ముడే సారథి అని, తమను సన్మార్గంలో నడిపించాలని కోరుతూ ఈ ముగ్గు వేస్తారు. అలాగే, పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తి తిరిగి వెళ్లేందుకు వీలుగా ఈ రథాన్ని తీర్చిదిద్దుతారని పురాణ గాథ. ఇది సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మికతకు, భగవంతుని పట్ల కృతజ్ఞతా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పెద్దలు చెబుతారు.

పశువులే అసలైన సంపద: చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పశువులే మన అసలైన సంపద అని, వాటిని పూజించే పవిత్ర సంప్రదాయాన్ని కనుమ గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. రైతులకు, పశువులకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని.. పశుపక్ష్యాదులను మనం ప్రేమగా చూసుకుంటే, ప్రకృతి కూడా మనల్ని కరుణిస్తుందన్నారు.

Tags:    

Similar News