PAWAN: సజ్జనార్‌పై పవన్ ప్రశంసల జల్లు
హైదరాబాద్ పోలీసులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల జల్లు
సినీ పరిశ్రమకు ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా పరిణమించిన పైరసీ భూతాన్ని కట్టడి చేయడంలో తెలంగాణ పోలీసులు సాధించిన విజయం దేశవ్యాప్తంగా సినీ వర్గాలకు గొప్ప ఊరటనిచ్చింది.ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి విజయం సాధించిన హైదరాబాద్ పోలీసులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సజ్జనార్ కదలిక తెచ్చారు
‘‘డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలు విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుబృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్‌కి అభినందనలు తెలియజేస్తున్నా’’ అని పవన్ ప్రశంసించారు. పైరసీతో సినీరంగానికి చాలా నష్టం జరిగిందని, దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. అతడిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
"ఐబొమ్మ రవి టాలెండ్ వాడుకోండి"
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌పై నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అతను చాలా టాలెంటెడ్‌గా కనిపిస్తున్నాడు. అతని హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు పనికొచ్చేలా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అతను చేసింది దుర్మార్గమైన పనే అన్నారు. రవి తన కసిని మంచి పనికి వినియోగించి ఉంటే బాగుండేదన్నారు. ఇక నుంచి అయినా రవి మారాలని కోరుకుంటున్నట్టు ఓ మూవీ ఈవెంట్లో శివాజీ పేర్కొన్నారు. శివాజీ వ్యాఖ్యలను పలువురు స్వాగతిస్తున్నారు.