SANKRANTHI: రైతు కష్టానికి గౌరవం తెలిపే మహోత్సవం సంక్రాంతి
పేరులోనే కాంతి నిండిన పండుగ.. ఆంధ్రుల సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి..
భోగి మంటల వేడి…
పిండి వంటల రుచి…
రంగురంగుల ముగ్గులు…
గొబ్బెమ్మల అందం…
పశువుల పూజ…
హరిదాసుల కీర్తనలు…
బంధుత్వాల అనుబంధం…
ఇవన్నీ ఒక్కచోట కలిసే పండుగే సంక్రాంతి. పేరులోనే కాంతి నిండిన ఈ పండుగ, ఆంధ్రుల సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక. రైతు కష్టానికి గౌరవం తెలిపే పండుగగా, పల్లె జీవన సౌందర్యాన్ని చాటే వేడుకగా, కుటుంబ బంధాలను మరింత బలపరిచే పండుగగా సంక్రాంతి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పంట చేతికొచ్చిన ఆనందాన్ని, ప్రకృతికి కృతజ్ఞతను, దేవతల ఆశీస్సులను ఒకేసారి కోరుకునే సందర్భమే ఈ నాలుగు రోజుల పండుగ.
సంక్రాంతి.. రైతు జీవితానికి పండుగ
ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంట ఇంటికి చేరే సమయమిది. చలికాలం చివర్లో, పంట పొలాలు పచ్చగా మెరిసే వేళ, ఆ ఆనందాన్ని పండుగగా మలుచుకునే సంప్రదాయం మనది. అందుకే సంక్రాంతిని వ్యవసాయ పండుగగా అభివర్ణిస్తారు. పాడిపంటలు, పశుసంపద, గ్రామీణ వాతావరణం – ఇవన్నీ సంక్రాంతిలో మరింత ఉజ్వలంగా కనిపిస్తాయి. పట్టణాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగ కోసం స్వగ్రామాలకు చేరుకోవడం, కుటుంబ సభ్యులతో కలసి ఆనందించడం ఈ పండుగ ప్రత్యేకత. పండుగలో రెండవ రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్ర ఘడియగా ఈ రోజును పరిగణిస్తారు. అందుకే ఈ రోజంతా సూర్యారాధనకు ప్రాధాన్యం ఉంటుంది. ఉదయం స్నానాదులు పూర్తి చేసి, పిండి వంటలు – పొంగలి, అరిసెలు, బూరెలు, గారెలు వంటి సంప్రదాయ వంటలు తయారు చేసి సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. వ్వులు, దానం చేయడం ఈ రోజు ప్రత్యేక ఆచారం. ఇది దానం చేసినవారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, పూలతో అలంకరించి, పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. హిళలు ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఆనందిస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆకాశాన్ని రంగులమయం చేస్తారు. గ్రామాల్లో ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది.
సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ. ఇది పూర్తిగా రైతులకు, పశుసంపదకు అంకితమైన రోజు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచిన పశువులను ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. ఎడ్లకు, ఆవులకు స్నానాలు చేయించి, కొమ్ములకు రంగులు వేసి, పూలతో అలంకరిస్తారు. ము పండించిన కొత్త పంటతో పొంగలి తయారు చేసి పశువులకు నైవేద్యంగా పెడతారు. ఇది పశువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచే ఆచారం. కనుమ రోజు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి విందు భోజనాలు చేస్తారు. గ్రామాల్లో కోడిపందాలు, ఎడ్ల పందాలు వంటి సంప్రదాయ ఆటలు జోరుగా జరుగుతాయి. సంక్రాంతి పండుగలో నాలుగవ రోజు ముక్కనుమ. దీనికి అంతంత మాత్రపు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు మాంసాహార విందులు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎక్కువగా ప్రయాణం చేయకూడదనే నమ్మకం ఉంది.ఆ రోజు దేవతలందరూ మన ఇంటికి వస్తారని, శని సంబంధిత నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలు చేస్తే అపశకునం జరుగుతుందని పండితులు చెబుతారు. అందుకే ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడపడం శ్రేయస్కరమని భావిస్తారు. కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేస్తారు.