స్టాక్ మార్కెట్లో బుల్ పరుగులు.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1230 పాయింట్ల లాభం
చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లలో ఉరిమే ఉత్సాహం కన్పించింది. ట్రేడింగ్ ఆరంభం నుంచే మంచి దూకుడుమీదున్న సూచీలు ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడలేదు.;
చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లలో ఉరిమే ఉత్సాహం కన్పించింది. ట్రేడింగ్ ఆరంభం నుంచే మంచి దూకుడుమీదున్న సూచీలు ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూడలేదు. గంట గంటకీ పెరిగిన కొనుగోళ్ల మద్దతుతో చివరికి ట్రేడింగ్ డే హై మార్క్ వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిడుదుకులకు లోనవుతోన్న దేశీయ మార్కెట్లో ఇవాళ బుల్ పరుగులు తీసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1230 పాయింట్లకి పైగా పెరిగింది. అలానే నిప్టీ కూడా ఇంట్రాడేలో 368 పాయింట్లు ఎగసింది. ఇవాళ్టి మార్కెట్లు ఐటీ, టెక్నాలజీతో పాటు అన్ని రంగాల కౌంటర్లు లీడ్ చేశాయి. ట్రేడింగ్ మొత్తం మీద నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14845 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 1128 పాయింట్లు పెరిగి 50వేల 136 పాయింట్ల దగ్గర ముగిశాయి. రెండు బెంచ్ మార్క్‌లు అలా 2.33శాతం వరకూ ఎగబాకాయి. కేపిటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్‌లో కొనుగోళ్ల హోరు ఓ రేంజ్‌లో సాగింది. దాంతో ఈ రెండు ఇండెసిస్ వరుసగా 1.01శాతం, 2.10శాతం పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ల సపోర్ట్‌తో ట్రేడింగ్ ఆసాంతం దేశీయ సూచీల్లో బుల్ రంకెలు వేసింది. దేశీయంగా కీలక రంగాల షేర్లు రాణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. ఎఫ్‌ఐఐలు, డీఐఐల పెట్టుబడులు పెరగడం మార్కెట్లను ముందుకు నడిపించింది. ఇక నాల్గో త్రైమాసిక ఫలితాలు త్వరలో ప్రారంభం కానుండటంతో, ఆయా కంపెనీల్లో చక్కని ప్రదర్శన నమోదు కావచ్చని అంచనాలు వెలువడంతో మార్కెట్లకు బూస్టింగ్‌నిచ్చింది. గతంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడమే అందుకు కారణం. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండడం.. టీకాల కోసం దేశాల మధ్య ఆశించిన మేర సహకారం ఉండడం కూడా మదుపర్ల సెంటిమెంటును పెంచాయి. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఐపీఓల జోరు కొనసాగుతుందన్న అంచనాలు, ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగిందన్న గణాంకాలు మార్కెట్లకు అండగా నిలిచాయి.