SILVER: వెండికి హాల్‌మార్క్..!
కల్తీకి చెక్ పెట్టనున్న కేంద్రం!... బంగారం తరహాలో వెండిపై BIS కసరత్తు... వెండి ధరల పెరుగుదలతో కల్తీ ముప్పు... పరిశ్రమ డిమాండ్‌కు స్పందించిన ప్రభుత్వం
కొంతకాలంగా పసిడితో పోటీపడుతూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన మార్గంగా మారడమే కాకుండా, సామాన్యుల శుభకార్యాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ధర పెరిగే కొద్దీ కల్తీ ముప్పు కూడా పొంచి ఉండటంతో, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. బంగారం తరహాలోనే వెండికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసే దిశగా భారతీయ ప్రమాణాల మండలి కసరత్తు చేస్తోంది.
పరిశ్రమ డిమాండ్.. ప్రభుత్వ యోచన
ప్రస్తుతం బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాగా, వెండికి ఇది ఇప్పటికీ స్వచ్ఛందంగానే కొనసాగుతోంది. అయితే, మార్కెట్లో వెండి వస్తువుల స్వచ్ఛతపై వినియోగదారుల్లో అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో, దీనిని తప్పనిసరి చేయాలని పరిశ్రమ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. దీనిపై బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలను అంచనా వేసి త్వరలోనే నిబంధనలు తీసుకువస్తామని వెల్లడించారు.
గణనీయంగా పెరుగుతున్న HUID నమోదు
ప్రస్తుతం స్వచ్ఛంద హాల్‌మార్కింగ్ విధానంలో కూడా వెండి వస్తువుల సంఖ్య భారీగా పెరుగుతుండటం విశేషం.
2024లో 31 లక్షల వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్ జరిగింది.
2025లో ఈ సంఖ్య ఏకంగా 51 లక్షలకు చేరింది.
హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వస్తువు నాణ్యతను మొబైల్ యాప్ ద్వారా స్వయంగా తనిఖీ చేసుకునే వీలుంటుంది. 800 నుండి 999 వరకు ఉన్న వివిధ స్వచ్ఛతా ప్రమాణాలతో (Grade) ప్రస్తుతం వెండికి సర్టిఫికేషన్ ఇస్తున్నారు. వెండికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, దీని అమలులో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారం సాధారణంగా భారీ ఆభరణాల రూపంలో ఉంటుంది. కానీ వెండిని చిన్నపాటి ఉంగరాలు, ముక్కుపుడకలు, మెట్టెలు లేదా పూజా సామాగ్రి వంటి తక్కువ బరువున్న వస్తువులుగా తయారు చేస్తారు. ఇలాంటి చిన్న వస్తువులపై HUID నంబర్‌ను ముద్రించడం, వాటిని ల్యాబ్‌లలో పరీక్షించడం కొంత క్లిష్టమైన ప్రక్రియ. వెండి వస్తువు విలువతో పోలిస్తే హాల్‌మార్కింగ్ ఛార్జీలు వినియోగదారుడికి భారంగా మారకుండా చూడటం ప్రభుత్వానికి పెద్ద సవాలు. హాల్‌మార్కింగ్ అమల్లోకి వస్తే, పాత వెండిని విక్రయించేటప్పుడు వినియోగదారులకు సరైన ధర లభిస్తుంది. కల్తీ లేని స్వచ్ఛమైన వెండి లభిస్తుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో పెరుగుతుంది. వెండి ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, పారదర్శకత అనేది అత్యంత కీలకం.