ప్రముఖ నటుడు, నిర్మాత దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ అమ్మగారు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వయోభారం వల్ల వచ్చిన సమస్యల కారణంగా అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు ఆమె మరణించారు. అల్లు రామలింగయ్య 2004 జూలై 31న చనిపోయారు. అప్పటి నుంచి తల్లిని కాపాడుకుంటూ వస్తున్నాడు అరవింద్. కనకరత్నమ్మ కు అల్లుడు అయిన చిరంజీవి నివాళులు అర్పించారు. ‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక కనకరత్నమ్మ మరణవార్త తెలియగానే ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్, మైసూరు షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.